చిలీలో భారీ కార్చిచ్చు.. కాలిబూడిదవుతోన్న ఇండ్లు 

లాటిన్ అమెరికా దేశమైన చిలీలో భారీ కార్చిచ్చు అంటుకుంది.  ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 46 మంది కాలిబూడిదయ్యారు. వెయ్యికి పైనే ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వందలాది మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్  తెలిపారు. సహాయక సిబ్బందికి సహకరించాలని ఆయన చిలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

అధిక ఉష్ణోగ్రతల వల్ల సెంట్రల్  చిలీ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. పర్యాటక ప్రాంతాలైన వినా డెల్ మార్, వాల్పరైజో ప్రాంతాల్లో మంటల తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ వ్యాపించడం వల్ల ఆయా ప్రాంతాల్లోని పర్యాటకులు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. మరోవైపు వేడిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఫారెస్ట్రీ కార్పొరేషన్ హెచ్చరించింది. 

ఒక్క వాల్పరైజో ప్రాంతంలోనే నాలుగు పెద్ద కార్చిచ్చులు చెలరేగాయి. మంటలు అంటుకున్న ప్రాంతాలకు అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే సహాయ బృందాలకు వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలుల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతుంది. ముందు జాగ్రత్తగా అధికారులు మంటలు ఉన్న ప్రాంతాల నుంచి స్థానికులను ఖాళీ చేయిస్తున్నారు. మొత్తం 43 వేల ఎకరాల్లో ఈ మంటల ప్రభావం ఉందని తెలుస్తోంది. దేశంలోని సెంట్రల్, దక్షిణ ప్రాంతాల్లోని అడవుల్లోని ఈ కార్చిచ్చు మంటలు చెలరేగాయి.